- బాయిలర్ ట్యూబ్ లీకేజీతో తాజాగా 600 మెగావాట్ల ప్లాంట్ షట్ డౌన్
- మార్చిలో 500 మెగావాట్ల ప్లాంట్ 2 సార్లు ట్రిప్
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు(కేటీపీపీ) తరచూ మొరాయిస్తోంది. ఓవర్ లోడ్, సాంకేతిక సమస్యలతో కరెంట్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతోంది. రిపేర్లకు 5 రోజుల సమయం పడుతుండడంతో రూ. కోట్లలో నష్టం వాటిల్లుతోంది. ఈ నెలలోనే మొదటి దశ ప్లాంట్ రెండుసార్లు ట్రిప్ కాగా. సోమవారం రెండవ దశ 600 మెగావాట్ల ప్లాంట్ బాయిలర్ ట్యూబ్ లీకేజీతో షట్ డౌన్ చేశారు. 10 రోజుల వ్యవధిలో రెండు ప్లాంట్లు షట్ డౌన్ కావడంతో కోట్లల్లో నష్టం వాటిల్లుతోంది.
రిపేర్లకు కోట్లలో ఖర్చు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్లోని కేటీపీపీలో మొదటి దశలో 500 మెగావాట్లు, 2వ దశలో 600 మెగావాట్ల ప్లాంట్లు రన్ అవుతున్నాయి. రెండు యూనిట్ల నుంచి 16.4 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ నెల20న కేటీపీపీ మొదటి దశ ప్లాంట్ బాయిలర్ ట్యూబ్ లీకేజీతో షట్ డౌన్ కాగా, 3 రోజుల్లో రిపేర్లు పూర్తి చేసి కరెంట్ ఉత్పత్తి చేపట్టారు. ఇదే ప్లాంట్ ఈ నెలలోనే రెండు సార్లు ట్రిప్ అయింది. సోమవారం రెండో దశ ప్లాంట్ బాయిలర్ ట్యూబ్ లీకేజీతో ప్లాంట్ షట్ డౌన్ చేశారు. రేపటిలోగా ప్లాంట్ రన్ అయ్యేలా రిపేర్లు చేస్తున్నట్లు ఇంజనీర్లు చెబుతున్నారు.
